మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 22, 2020 , 19:53:39

చైనా గూఢచర్యం రాకెట్‌ దర్యాప్తులో వెలుగులోకి కొత్త విషయాలు

చైనా గూఢచర్యం రాకెట్‌ దర్యాప్తులో వెలుగులోకి కొత్త విషయాలు

న్యూఢిల్లీ : చైనా గూఢచర్యం రాకెట్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత జర్నలిస్ట్ రాజీవ్ శర్మ, చైనా మహిళ క్విన్ షి, ఆమె నేపాల్ సహచరుడు షేర్‌సింగ్ అలియాస్ రాజ్ బోహ్రాలను గూఢచర్యం కింద అరెస్టు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు పలు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల వివరాలను పొందాలని క్విన్‌ షిని ఆదేశించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

దలైలామానే టార్గెటా?

దర్యాప్తు అధికారులు చెప్పిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బౌద్ద భిక్షువు దలైలామాకు అందిస్తున్న చికిత్స గురించి సమాచారం సేకరించడంలో క్విన్‌ షి నిమగ్నమై ఉన్నది. దలైలామా సందర్శించే దవాఖానలతో పాటు అతని వైద్యుల వివరాలు, తీసుకుంటున్న ఔషధాల వివరాలను సేకరించే పనిలో పడింది. మహాబోధి ఆలయంలోని ఒక సన్యాసి 2019 చివరలో కోల్‌కతాలోని ఒక మహిళకు క్విన్‌ షిని పరిచయం చేయగా.. ఆ మహిళ తన పత్రాలను ఆంగ్లంలో ఇస్తుందని ఆమెకు చెప్పింది. ఆమె వాటిని మాండరిన్‌ భాషలోకి అనువదించిన తరువాత ఆ పత్రాలను చైనా భద్రతా సంస్థలోని సీనియర్ కార్యకర్తలకు పంపవలసి ఉన్నది. క్విన్‌ షితో సన్నిహితంగా ఉన్న వారిని ప్రశ్నించడానికి దర్యాప్తు బృందాలను కోల్‌కతా, ఇతర ప్రాంతాలకు పంపారు.

నిధుల కోసం షెల్‌ కంపెనీలు

జర్నలిస్ట్ రాజీవ్ శర్మకు నిధులను బదిలీ చేయడానికి షెల్ కంపెనీలను కూడా విదేశీ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు చైనా జాతీయులు ఝాంగ్ చాంగ్, ఆయన భార్య చాంగ్ లీ లియా - సూరజ్, ఉషా అనే నకిలీ పేర్లతో ఎంజెడ్‌ ఫార్మసీ, ఎంజెడ్‌ మాల్స్ నడుపుతున్నారు. వారిద్దరూ చైనాలో ఉండగా.. వారి తరపున, క్వింగ్ షి, రాజ్ బోహ్రా అనే నేపాలీ జాతీయుడు.. ఇద్దరూ ఎంజెడ్‌ ఫార్మసీ డైరెక్టర్లుగా మహిపాల్పూర్ నుంచి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

భారత జర్నలిస్ట్ రాజీవ్ శర్మ కూడా క్విన్‌ షితో నిరంతరం సన్నిహితంగా ఉన్నారని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. వసంత కుంజ్‌లోని క్విన్‌ షి నివాసం నుండి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల విశ్లేషణ ఆమె పరిచయాలను విశ్లేషిస్తున్ారు. 2010- 2014 మధ్య జర్నలిస్ట్ రాజీవ్ శర్మ చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌కు కాలం రాశారు. దీనిని గమనించిన చైనాలోని కున్మింగ్ నగరానికి చెందిన మైఖేల్ అనే చైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్ తన లింక్డ్ఇన్ ఖాతా ద్వారా రాజీవ్ శర్మను సంప్రదించి, చైనా మీడియా సంస్థలో ఇంటర్వ్యూ కోసం కున్మింగ్‌కు ఆహ్వానించాడని పోలీసులు తెలిపారు. ఈ యాత్ర మొత్తానికి మైఖేల్, ఆయన సహచరుడు జూలే నిధులు సమకూర్చినట్లు తేలింది.

డోక్లాంలో సైనిక సమాచారంపై కన్ను

భారత-చైనా సంబంధాల యొక్క వివిధ అంశాలపై ఇన్‌పుట్ల అందించాలని రాజీవ్ శర్మను మైఖేల్‌ కోరినట్లు సమాచారం. 2016- 18 మధ్య జర్నలిస్ట్ రాజీవ్ శర్మ.. మైఖేల్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. భూటాన్-సిక్కిం-చైనా జంక్షన్‌లో డోక్లాం, భారతదేశం-మయన్మార్ సైనిక సహకారం యొక్క నమూనా, భారత్‌-చైనా సరిహద్దు సమస్యతోపాటు ఇతర ముఖ్య విషయాలపై సమాచారం అందించే పని ఆయనపై ఉన్నదని గుర్తించారు. ఆ తర్వాత రాజీవ్ శర్మ లావోస్, మాల్దీవులలో మైఖేల్, జూలను కలుసుకుని పలు అంశాల గురించి వారికి వివరించారు. ఇలాఉండగా, రాజీవ్ శర్మ బెయిల్ దరఖాస్తును ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది. క్విన్ షి, రాజ్‌ బోహ్రా ఇంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.