బీజింగ్: పెండ్లి చేసుకుంటారా? ఉద్యోగం నుంచి తొలగించమంటారా? అంటూ చైనాలోని ఒక కంపెనీ తమ సంస్థ ఉద్యోగులకు తాఖీదులు ఇచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం ప్రకారం తమ సంస్థలోని ఉద్యోగుల్లో వివాహితుల సంఖ్యను పెంచే లక్ష్యంతో షన్‌టైన్ కెమికల్ గ్రూప్ కంపెనీ యాజమాన్యం తమ కింద పనిచేసే 1200 మంది ఉద్యోగుల్లో అవివాహితులు, విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసింది.
28-58 మధ్య వయసున్న వారందరూ సెప్టెంబర్‌లోగా వివాహం చేసుకోవాలని, లేకపోతే ఉద్వాసన తప్పదంటూ హెచ్చరించింది. అంతే కాకుండా మార్చి నాటికి స్థిరపడని ఉద్యోగులు స్వీయ విమర్శ లేఖను సమర్పించాలని ఆదేశించింది. వారి వైవాహిక స్థితిని జూన్‌లో ఒకసారి పరిశీలిస్తామని, సెప్టెంబర్ వరకు కూడా వివాహం చేసుకోకపోతే చర్యలు తప్పవని తెలిపింది. లినీలో 2001లో స్థాపించిన ఈ సంస్థ టాప్ 50లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ విధానంపై ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘కంపెనీ తన పని తాను చూసుకోవాలి. ఇలా ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లోకి జోక్యం చేసుకోవడం ఎంతమాత్రం సరికాదు’, ‘ఇది పెండ్లి చేసుకునే స్వాతంత్య్రాన్ని హరించడమే కాక, రాజ్యాంగ విరుద్ధం కూడా’ అని పలువురు కామెంట్లు పెట్టారు. అయితే కంపెనీ ప్రకటనను కొందరు అధికారులు మందలించినట్టు తెలిసింది. దీంతో ఈ నెల 14న ఆ సంస్థ తన నూతన పాలసీని ఉపసంహరించుకున్నట్టు సమాచారం.