బీజింగ్, సెప్టెంబర్ 21 : చైనా ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్ల వాడకంలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై భిన్నస్పందనలు వినిపిస్తున్నాయి. కొత్త నిబంధన విషయానికి వస్తే ఎవరైనా టాయిలెట్‌కు వెళ్లినప్పుడు టిష్యూ పేపర్ తీసుకోవడానికి కొన్ని షరతులు విధించింది. మరుగుదొడ్లలో అమర్చిన మిషిన్లలో ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
అది స్కాన్ చేశాక మిషన్‌లో ప్రసారమయ్యే 30 సెకన్ల నిడివి గల వాణిజ్య ప్రకటన చూసిన తర్వాతనే పేపర్ బయటకు వచ్చేలా అధికారులు సెట్టింగ్స్ చేశారు. ఒకవేళ యాడ్ చూడటం ఇష్టంలేకపోతే.. నిర్ణీత రుసుం చెల్లించి, పేపర్ తీసుకోవాల్సి ఉంటుంది. చైనాలోని కొన్ని పబ్లిక్ టాయిలెట్లలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనపై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి మిషిన్లను పగలగొట్టాలంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.