బీజింగ్, అక్టోబర్ 6: సైన్స్, టెక్నాలజీలో ప్రతిభావంతులైన విదేశీయులకు ఆహ్వానం పలుకుతూ చైనా విస్తృతంగా ప్రచారం చేసిన ‘కే-వీసా’ అమల్లోకి రాలేదు. అమెరికా హెచ్-1బీ వీసాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పేరొందిన కే-వీసాల జారీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సింది. అయితే , చైనా జాతీయ దినోత్సవంఇతర పండుగల నేపథ్యంలో ఆయా దేశాల్లోని చైనా రాయబార కార్యాలయాల్ని అక్టోబర్ 8 వరకు మూసివేశారు. దీంతో వీసాల దరఖాస్తు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేగాక చైనా సోషల్మీడియా వేదికల్లో ‘కే-వీసాల జారీ’ చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాలసీపై యువత సహా ఇతర వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఉపాధి రంగంలో మందగమనం నెలకొన్న ఈ సమయంలో ఇలాంటి విధానాల్ని ఎంచుకోవడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ప్రస్తుతం చైనాలోని జాబ్ మార్కెట్లో ఏటా కొత్తగా 1.2 కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ ప్రవేశిస్తున్నారు. ఆ దేశ యువతలో నిరుద్యోగరేటు 19 శాతానికి చేరుకోవడంపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది.