Gold ATM | బీజింగ్: చైనాలోని షాంఘైలో ఉన్న గోల్డ్ ఏటీఎం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. ఖాతాదారు దీనిలో బంగారు నాణేలు, కడ్డీలు, ఆభరణాలను ఉంచితే, వాటిని కరిగించి, స్వచ్ఛతను తనిఖీ చేసి.. ఆ బంగారం బరువుకు తగిన మార్కెట్ విలువను డిజిటల్ కరెన్సీ రూపంలో ఖాతాదారు బ్యాంకు ఖాతాకు పంపిస్తున్నది. ఈ ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీని గురించి టర్కిష్ టెక్ ఇన్ఫ్లూయెన్సర్ టన్సు యెగెన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఇది చైనాలో ఏర్పాటు చేసిన మొదటి గోల్డ్ ఏటీఎం. ఈ గోల్డెన్ ఏటీఎంను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. భవిష్యత్తులో కరెన్సీ మార్పిడి, ఆర్థిక లావాదేవీల్లో జరిగే మార్పుల గురించి చర్చను ప్రారంభించారు. చైనా అద్భుతాలు సృష్టిస్తున్నదని, తేలికగా, వేగంగా, శక్తిమంతంగా పని చేసే ఇన్నోవేషన్స్ చేస్తున్నదని కొందరు వ్యాఖ్యానించారు. పాత సంపదను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడానికి నూతన మార్గాలను అన్వేషిస్తున్నదని ప్రశంసించారు. సంప్రదాయ ఆస్తులను తదుపరి తరం ఫిన్టెక్తో కలపడంలో చైనా దూసుకెళ్తున్నదని కొందరు వ్యాఖ్యానించారు.