బీజింగ్ : తన బ్యాటరీలను తానే మార్చుకొనే హ్యూమనాయిడ్ రోబోలను చైనా ఆవిష్కరించింది. ఇలాంటి రోబోల ఆవిష్కరణ ప్రపంచంలో ఇదే తొలిసారి. వాకర్ ఎస్2గా పిలిచే ఈ రోబోల పనితీరును వివరించే వీడియోను వాటి తయారీ సంస్థ యూబీటెక్ రోబోటిక్స్ గురువారం విడుదల చేసింది. అందులో ఓ రోబో చార్జింగ్ స్టేషన్కు వెళ్లి తన ఛాతీ నుంచి క్షీణించిన బ్యాటరీలను తొలగించి వాటిని చార్జింగ్ డాక్లో ఉంచింది.
ఆ తర్వాత తాజా బ్యాటరీలను అమర్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజా ఆవిష్కరణ ప్రకారం మనుషుల సాయం లేకుండా, నిరంతరాయంగా కనీసం 24 గంటలపాటు రోబోలు పనిచేయగలవని యూబీటెక్ రోబోటిక్స్ తెలిపింది. చైనా ప్రభుత్వం కొన్నేండ్లుగా రోబోటిక్స్ను, కృత్రిమ మేధను ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనాను ‘ఎదుగుతున్న రోబోటిక్స్ పవర్ హౌస్’గా మూడీస్ నివేదిక గురువారం పేర్కొంది.