షాంగ్జీ: చైనాలో ఓ మహిళ లవ్ ఇన్సూరెన్స్(Love Insurance) పాలసీ చేసి జాక్‌పాట్ కొట్టేసింది. సెంట్రల్ చైనాలోని షాంగ్జీ ప్రావిన్సుకు చెందిన వూ అనే అమ్మాయి 2016 సంవత్సరంలో 199 యువాన్లకు.. అంటే 28 డాలర్లకు లవ్ బీమా చేయించింది. అయితే పదేళ్ల డేటింగ్ తర్వాత ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడింది. ఆ లవ్ పాలసీతో ఆమె పదివేల యువాన్లను అంటే 1400 డాలర్లు విత్‌డ్రా చేసుకున్నది. వూ, వాంగ్లు 2025లో మ్యారేజ్ రిజిస్టర్ చేసుకున్నారు. ఒకే యూనివర్సిటీలో చదువుకున్న ఆ జంట.. 2015 నుంచి రిలేషన్లో ఉన్నారు.
డేటింగ్ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా 199 యువాన్లకే లవ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నది. చైనా లైఫ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కంపెనీ డిస్కౌంట్లో భాగంగా చాలా తక్కువ ధరకే లవ్ బీమా ఇచ్చింది. లవ్ ఇన్సూరెన్స్ కట్టిన జంట తమ పాలసీని మూడేళ్ల తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. అయితే పదేళ్ల మెచ్యూరిటీ తర్వాత ఆ జంటకు పదివేల గులాబీ పువ్వులు లేదా 0.5 క్యారెట్ల డైమండ్ రింగ్ ఇస్తారు. ఈ రెండూ వద్దు అనుకుంటే పదివేల యువాన్ల నగదు ఇస్తారు. కానీ ఈ లవ్ ఇన్సూరెన్స్ పాలసీని 2017లోనే ఆపేసినట్లు తెలిసింది. ప్రస్తుతం చైనాలో ఈ లవ్ ఇన్సూరెన్స్ స్టోరీ చర్చనీయాంశమైంది.