China wildfire : చైనా (China) దేశంలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తోంది. నార్తర్న్ చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లోగల లింగ్చువాన్ కౌంటీ (Lingchuan county) లో మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. ఆ మంటలను అదుపు చేసేందుకు ఏకంగా మూడు వేల మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గత శనివారం పొరుగున ఉన్న హుగువాన్ కౌంటీలో చెలరేగిన ఈ కార్చిచ్చు.. ఆదివారం బలమైన గాలుల కారణంగా లింగ్చువాన్ లియుక్వాన్ టౌన్షిప్ వరకు వ్యాపించిందని చెప్పారు.
ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఐదు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. లింగ్చువాన్ నుంచి 266 మందిని ఖాళీ చేయించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కార్చిచ్చును అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే బలమైన గాలులు వీయడం.. కార్చిచ్చు చెలరేగిన ప్రాంతం సంక్లిష్టమైన భూభాగం కావడం.. దట్టమైన, మండే స్వభావం కలిగిన వృక్ష సంపద ఆ ప్రాంతంలో విరివిగా ఉండటం రెస్క్యూ ఆపరేషన్‌కు సవాల్‌గా మారుతున్నాయని అధికారులు తెలిపారు.