బీజింగ్: డ్రాగన్ దేశం చైనా తన అంతరిక్ష పరిశోధనల కోసం విదేశీ వ్యోమగాములకు అవకాశం ఇచ్చింది. దీనిలో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యోమగాముల(Pakistani Astronauts)ను ఎంపిక చేసినట్లు చైనా ప్రకటించింది. మొహమ్మద్ జీషాన్ అలీ, ఖుర్రమ్ దౌద్కు చైనా ఆస్ట్రోనాట్ శిక్షణ ఇవ్వనున్నది. తమ స్పేస్ స్టేషన్ కార్యక్రమాల కోసం చైనా ఈ ఎంపిక చేసింది. శిక్షణ కోసం రిజర్వ్ ఆస్ట్రోనాట్స్ గా ఆ ఇద్దరూ తమ దేశానికి రానున్నట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ఓ ప్రకటనలో చెప్పింది. శిక్షణ పూర్తి అయిన తర్వాత ఓ ఆస్ట్రోనాట్ తమ స్పేస్ స్టేషన్ తియాన్‌గాంగ్ మిషన్‌లో పనిచేస్తారని ఆ ఏజెన్సీ వెల్లడించింది.
పేలోడ్ స్పెషలిస్టుగా అతను కీలక పాత్ర పోషించనున్నారు. ఆ స్పెషలిస్టు చైనా స్పేస్ స్టేషన్ చేరుకోనున్న తొలి విదేశీ వ్యక్తి కానున్నారు. జీషాన్ అలీ, ఖుర్రమ్ దౌద్లకు పలు దఫాలుగా సెలెక్షన్ ప్రాసీజర్ జరిగిందని చైనా పేర్కొన్నది. అంతరిక్ష రంగంలో సాధించిన అభివృద్ధిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో తాము విదేశీ ఆస్ట్రోనాట్స్‌కు అవకాశం ఇస్తున్నట్లు స్పేస్ ఏజెన్సీ చెప్పింది. చైనా ఆస్ట్రోనాట్ సెంటర్లో తమ వ్యోమగాములు శిక్షణ పొందనున్నట్లు పాకిస్థానీ సమాచారం శాఖ తెలిపింది.