బీజింగ్ : చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య బుధవారానికి దాదాపు 20 వేలకు పైగా చేరింది. ఈ ఒక్కరోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. షాంఘైలోనే అత్యధిక కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు. అయితే, రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ట కేసులుగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
చైనాలో ఎక్కడికక్కడ లాక్డౌన్లు విధించడం, పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించడం, అంతర్జాతీయ రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించడంతో మార్చి వరకు పాజిటివ్ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అయితే గత కొద్ది వారాల నుంచి పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. షాంఘైలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేని కేసులే అధికంగా ఉన్నాయన్నారు. షాంఘైలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.