బీజింగ్: చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం సోమవారం కొండల్లో కూలిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విమానం ధ్వని వేగంతో ప్రయాణించి కొండ ప్రాంతాన్ని ఢీకొన్నట్లు ఫ్లైట్ ట్రాక్ డేటా విశ్లేషణ ద్వారా గుర్తించారు. నంబర్ 5735 విమానం, 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో సోమవారం మధ్యాహ్నం 1.20 గంటలకు కున్మింగ్ నుండి గ్వాంగ్జౌకి బయలుదేరింది. గంట తర్వాత వుజా నగరం సమీపంలోని గ్రామీణ కొండ ప్రాంతాల్లో అది నిటారుగా కూలింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అందులోని 132 మంది మరణించారు. అయితే చైనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆ విమానంలోని ముగ్గురు పైలెట్లకు పూర్తి లైసెన్స్ ఉన్నదని, వారి ఆరోగ్య నివేదికలు సరిగానే ఉన్నాయని వెల్లడించారు.
కాగా, కూలిన చైనా విమానంలోని రెండు బ్లాక్ బాక్స్‌లలో ఒక దానిని బుధవారం గుర్తించారు. చైనా విమానయాన సంస్థ అధికార ప్రతినిధి లియు లుసాంగ్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఆ బ్లాక్ బాక్స్ బాగా ధ్వంసమైనట్లు ఆ దేశ అధికార మీడియా పేర్కొంది. కూలిన బోయింగ్ 737-800 విమానంలో రెండు ఫ్లైట్ రికార్డులున్నాయి. కాక్‌పిట్‌లో ఒక వాయిస్ రికార్డర్ ఉండగా, ప్రయాణికుల క్యాబిన్ చివరివైపున మరో వాయిస్ రికార్డర్‌తోపాటు ఫ్లైట్ డేటా ట్రాకర్ ఉన్నది. అయితే గుర్తించిన బ్లాక్ బ్లాక్స్ క్రూ క్యాబిన్లోనిదా లేక విమానం చివరి వైపు ఉన్నదా అన్నది తెలియలేదు.
మరోవైపు ఆ విమానం 29 వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు కూలిపోయింది. విమానం కూలిన సమయంలో అది సుమారు ధ్వని వేగంతో గంటకు 595 మీటర్ల మేర నిటారుగా ప్రయాణించినట్లు ఫ్లైట్ రాడర్ 24 డేటా ద్వారా అంచనా వేశారు. సాధారణంగా విమానాలు పది వేల అడుగుల ఎత్తులో గంటకు 288 మీటర్ల మించి ప్రయాణించవని విశ్లేషకులు తెలిపారు. అయితే
విమానం ముందు భాగం భూమికి నిటారుగా ఉండటం వల్లనే అది ధ్వని వేగంతో సమానంగా ప్రయాణించి సుమారు రెండున్నర నిమిషాల్లో 26 వేల అడుగుల ఎత్తును కోల్పోయి అనంతరం 40 సెకండ్లలో 3,200 ఎత్తు నుంచి కొండ భాగంలో కూలినట్లు భావిస్తున్నారు.