China Airlines : విమాన ప్రయాణాల్లో అప్పుడప్పుడు కొందరు ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరిని తోటి ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. మరికొందరిని సిబ్బంది ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తుంది. కానీ తాజాగా చైనాకు చెందిన ఓ ప్రయాణికుడిని మరో ప్రయాణికుడి సోమరితనం, ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం గాయపడేలా చేసింది. దాంతో అతను నష్టపరిహారం కోరూతూ ఎయిర్‌లైన్స్‌పై దావా వేశాడు.
చైనాలోని సౌతర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కిన ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడు కూర్చున్న సీటులోని ఓ సూది అతని వేలుకు గుచ్చుకుంది. దాంతో రక్తస్రావం అయ్యింది. గమనించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది అతడికి వెంటనే ప్రథమ చికిత్స చేశారు. విమానం ల్యాండింగ్ అనంతం అతడు చెల్లించిన టికెట్ డబ్బులను వాపస్ చేశారు. అదనంగా కొంత మొత్తం అందించారు.
అంతకుముందు ఆ సీటులో కూర్చుని ప్రయాణించిన వ్యక్తి ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుని సూదిని సీట్లోనే వదిలేసినట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది గుర్తించారు. సదరు ప్రయాణికుడు లేజీగా సీట్లోనే సూదిని వదిలేయడం, సిబ్బంది కూడా విమానాన్ని తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఘటనకు కారణమైంది. సూది గుచ్చుకున్నందుకు టికెట్ డబ్బులు వాపస్ చేసినా, కొంతమొత్తం నగదు చెల్లించినా బాధిత ప్రయాణికుడు సంతృప్తి చెందలేదు.
ఈ ఘటన ద్వారా తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని, భవిష్యత్తులో అవసరమైతే చికిత్సకు ఖర్చును కూడా ఎయిర్‌లైన్స్ భరించాలని, అందుకు 1,30,000 యువాన్లు (రూ.15 లక్షలకు పైగా) చెల్లించాలని డిమాండ్ చేశాడు. అందుకు సదరు సంస్థ నిరాకరించింది. దాంతో అతడు న్యాయస్థానంలో దావా వేశాడు. ఆ తర్వాత సదరు సంస్థ బాధితుడి డిమాండ్లకు అంగీకరించింది. జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరింది.