China super soldier | 2012.. ఫ్రాన్స్.. ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు.. ఇమ్మాన్యుయేల్ షార్పీ, జెన్నిఫర్ డౌడ్నా.. తాము కనిపెట్టిన కొత్త సాంకేతికతను పరిచయం చేశారు. ఈ టెక్నాలజీ పేరు ‘క్రిస్పర్’. ఈ టెక్నాలజీతో మానవుడి డీఎన్ఏను మార్చడం ద్వారా కోరుకున్న బిడ్డ పుట్టవచ్చు. ఈ టెక్నాలజీతో పుట్టిన పిల్లాడు ఎలాంటి సందర్భంలో కూడా ఆనారోగ్యం బారిన పడడు.
2020.. చైనా.. అచ్చం ఇదే టెక్నాలజీని ఉపయోగించి ‘సూపర్ సోల్జర్’ ను సిద్ధం చేస్తున్నారు. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు. అక్షరాలా అగ్రదేశం అమెరికా ఆరోపిస్తున్నది. యుద్ధరంగంలోకి దిగిన వీరు నిద్ర, ఆకలి లేకుండా ఎన్ని రోజులైనా విసుగు, విరామం లేకుండా పోరాడే శక్తిని కలిగి ఉంటారంట.
అమెరికన్ ఇంటెలిజెన్స్ వివరాల ప్రకారం, రెండేండ్ల క్రితం 2020 లోనే ‘క్రిస్పర్’ టెక్నాలజీ సహాయంతో చైనా సూపర్ సైనికులను తయారు చేయడం ప్రారంభించింది. ఇందుకోసం చైనాలో సైనికుల డీఎన్ఏ నమూనాలను తీస్తున్నారు. ఈ డీఎన్ఏను మార్చడం ద్వారా ప్రమాదకరమైన సూపర్ సోల్జర్స్ తయారు చేయాలనే ప్లాన్‌లో చైనా ఉన్నది. అమెరికా చేసిన ఈ వాదనను బ్రిటన్ కూడా సమర్థించడం విశేషం.
అప్పటి అమెరికా గూఢచార సంస్థ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రికలో రాసిన కథనం ప్రకారం, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా మారేందుకు చైనా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నది. ఇందులో భాగంగానే సూపర్ సోల్జర్ రూపకల్పన. ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లడ్షాట్’ , ‘యూనివర్సల్ సోల్జర్’ వంటి పలు సినిమాల్లో జీన్ ఎడిట్ చేసిన సూపర్ సైనికులను చూపించారు. ఆ టెక్నాలజీని, విజన్‌ను రియాల్టీగా మార్చేందుకు చైనా ప్రస్తుతం కృషి చేస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్నది.
2018 నవంబర్.. ప్రపంచంలోనే తొలి డిజైనర్ బేబీని తయారు చేసినట్లు చైనాకు చెందిన హే జియాన్కుయ్ అనే శాస్త్రవేత్త వెల్లడించాడు. ఇందుకోసం ఎలుకలు, పిల్లులు, మనుషుల పిండాలపై పరిశోధనలు చేశాడు. మానవ పిండంలో డీఎన్ఏ మార్పులు చేసిన తర్వాత అతడు ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలిపాడు. ఈ పరిశోధన వల్ల లులూ, నానా అనే ఇద్దరు కవలలు జన్మించారు. హెచ్ఐవీ, అనేక ప్రమాదకరమైన వ్యాధులు ఈ పిల్లలను ప్రభావితం చేయని విధంగా ఈ ఇద్దరు పిల్లల డీఎన్ఏను సవరించారు. డిజైనర్ బేబీని తయారు చేసిన రెండేండ్ల తర్వాత మాత్రమే చైనా ఈ టెక్నాలజీ ద్వారా సూపర్ సైనికులను తయారు చేసే పనిని ప్రారంభించిందని అమెరికా నిఘా సంస్థ పేర్కొన్నది.
సూపర్ సోల్జర్తో ఉపయోగాలివీ..
యుద్ధ సమయాల్లో సాధారణ సైనికులు ఆహారం, వాతావరణం, ఇతర కారణాల వల్ల అనారోగ్యానికి గురవుతుంటారు. అదే డీఎన్ఏలో మార్పులు చేయడం వల్ల సూపర్ సోల్జర్‌కు ఎలాంటి జబ్బు రాదు.
సూపర్ సోల్జర్‌కి సాధారణ మనుషుల మాదిరిగా భావోద్వేగాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో మరింత క్రూరంగా, కనికరం లేకుండా ప్రవర్తిస్తాడు.
సూపర్ సోల్జర్ సాధారణ సైనికుల కంటే మెరుగ్గా, ఖచ్చితంగా తన లక్ష్యాన్ని అందుకుంటాడని సైన్స్ జర్నల్ నేచర్ బయోటెక్నాలజీ తన నివేదికలో వెల్లడించింది. బయోకెమికల్ కూడా ఈ సూపర్ సోల్జర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. ఈ పరిస్థితుల్లో రసాయన యుద్ధంలో కూడా సూపర్ సోల్జర్ను ఆపడం ఎవరి వల్లా కాదు. జన్యు మార్పు కారణంగా తయారయ్యాడు కాబట్టి కాల్చి చంపినా లేదా గాయపడినా యుద్ధభూమిలోనే ఉంటాడు. ఆహార ధాన్యాలు నిండుకుంటే సైనికులు యుద్ధంలో ఎక్కువ కాలం జీవించడం కష్టం. కానీ, సూపర్ సైనికుడు చాలా రోజులపాటు ఆకలి లేకుండా, నిద్రపోకుండా పోరాడగలడు.