Shanghai-Delhi flight : చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ (China Eastern airlines) సంస్థ ఆదివారం షాంఘై-ఢిల్లీ (Shanghai-Delhi) విమాన సర్వీసును ప్రారంభించింది. 95 శాతం ఆక్యుపెన్సీతో ఈ విమానం నడిపింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్‌కు నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్న చైనా తొలి విమానయాన సంస్థగా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ నిలిచింది. ఎంయూ 563 విమానం.. 248 మంది ప్రయాణికులతో షాంఘైలోని పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది.
భారత్‌కు చెందిన ఇండిగో సంస్థ సోమవారం నుంచి ఢిల్లీ-గువాంగ్ఝౌకు విమాన సర్వీసులను నడపనుంది. షాంఘై-ఢిల్లీ మార్గం అత్యంత కీలకమైనది. ఈ నూతన విమాన సర్వీసువల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధ రాకపోకలు పెరుగుతాయని చైనా అధికారిక ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక పేర్కొంది.
కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత కరోనా ప్రభావం తగ్గినా తూర్పు లఢఖ్‌లో ఉద్రిక్తతలవల్ల విమాన సర్వీసుల పునరుద్ధరణ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో నవంబర్ 26న రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. నాడు కోల్‌కతా నుంచి బయల్దేరిన ఇండిగో విమానం గువాంగ్‌ఝౌలో దిగింది.