న్యూఢిల్లీ: చైనాలో ఇవాళ తన విక్టరీ డే పరేడ్‌లో ఆయుధాలను ప్రదర్శించింది. కొత్త తరహా డీఎఫ్-5సీ(DF-5C Nuclear Missile) ద్రవ ఇంధన ఖండాంతర వ్యూహాత్మక అణ్వాయుధ క్షిపణిని ఆవిష్కరించింది. ఈ క్షిపణి సుమారు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అంటే మొత్తం ప్రపంచాన్ని ఒకేసారి ఇది చుట్టేయగలదు. గతంలో ఉన్న డీఎఫ్ సిరీస్ మిస్సైళ్ల కన్నా ఇది అత్యాధునికమైంది. డీఎఫ్-5 సిరీస్, డీఎఫ్-41 మిస్సైళ్ల కన్నా టెక్నాలజీలో అడ్వాన్స్ ఉంది. వ్యూహాత్మకంగా మిస్సైల్ ముందంజలో ఉన్నట్లు మిస్సైల్ టెక్నాలజీ నిపుణుడు ప్రొఫెసర్ యాంగ్ చెంగ్జున్ తెలిపారు.
డీఎఫ్-5సీలో ఆరు రకాల ప్రత్యేక ఫీచర్లు ఉన్నట్లు చెప్పారు. ఈ మిస్సైల్ నిర్మాణం కొత్తగా ఉందని, దీన్ని మూడు వాహనాల్లో తరలించడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న డీఎఫ్-5 సిరీస్‌లతో పోలిస్తే దీని లాంచ్ టైం చాలా తక్కువగా ఉందని తేల్చారు. ఈ మిస్సైల్ రేంజ్ సుమారు 20 వేల కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. తమకు ప్రమాదం ఉన్న ఏ దేశాన్ని అయినా ఈ క్షిపణితో చైనా దాడి చేయగలదు. లాంచింగ్ విధానాల్లో డీఎఫ్-5సీ చాలా భిన్నంగా ఉన్నట్లు యాంగ్ తెలిపారు.
ఫ్లయిట్ స్పీడ్ చాలా వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. డీఎఫ్-5సీ క్షిపణి ధ్వని వేగం కన్నా పది రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అణ్వాయుధ, సంప్రదాయ వార్‌హెడ్స్‌తో వెళ్లే ఎంఐఆర్వీ వాహనాలతో డీఎఫ్-5సీ క్షిపణులు తీసుకెళ్లవచ్చు.