న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: అమెరికా, భారత్, యూరప్‌తోసహా ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాన్నయినా ఛేదించే సామర్థ్యం గల అణు క్షిపణిని చైనా తన విక్టరీ పరేడ్ సందర్భంగా బుధవారం బీజింగ్‌లోని చారిత్రాత్మక తియాన్మన్ స్కేర్‌లో ప్రదర్శించింది. ఆధునీకరించిన తన డాంగ్‌ఫెంగ్-5సీ అణు క్షిపణిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తోసహా 20 దేశాలకు చెందిన ప్రపంచ నాయకుల సమక్షంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ పరేడ్‌ని వీక్షించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపునకు సంబంధించిన 80వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ప్రపంచంలోనే అత్యంత భారీ సైనిక పరేడ్‌ని చైనా నిర్వహించింది.
ద్రవ ఇంధనంతో పనిచేసే ఈ ఖండాంతర క్షిపణికి 20,000 కిలోమీటర్లకు పైగా దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించే సామర్థ్యం ఉన్నట్లు చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ వెల్లడించింది. ప్రపంచంలో ఏ మూలనున్న లక్ష్యాన్నయినా ఇది ఛేదించగలదని చైనా ప్రభుత్వ వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. చైనా గతంలో తయారుచేసిన డీఎఫ్ సిరీస్‌కి చెందిన డీఎఫ్-5 సిరీస్, డీఎఫ్-41 క్షిపణులలోని సాంకేతిక ప్రయోజనాలన్నిటినీ మేళవించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డీఎఫ్-5సీ ద్రవ ఇంధన ఖండాతర వ్యూహాత్మక అణు క్షిపణిని తయారుచేసినట్లు చైనాకు చెందిన క్షిపణి సాంకేతికత, అణు నిరాయుధీకరణ నిపుణుడు ప్రొఫెసర్ యాంగ్ చెంగ్విన్ తెలిపారు.
ప్రపంచ మానవాళి ప్రస్తుతం శాంతి లేదా యుద్ధాన్ని ఎంచుకునే పరిస్థితి ఏర్పడిందని జిన్‌పింగ్ అన్నారు. పరేడ్‌ని తిలకించేందుకు వచ్చిన 50,000 మందికిపైగా వీక్షకులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ శాంతి లేక యుద్ధం, చర్చలా లేక ఘర్షణా అని ఎంచుకునే పరిస్థితిని ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. చైనా ఎటువంటి బెదిరింపులకు లొంగబోదని పరోక్షంగా అమెరికాను ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. చైనాను ఎవరూ అడ్డుకోలేరని ప్రకటించారు.