Chinese Crane Company | బీజింగ్, జనవరి 29: ఒక పెద్ద టేబుల్.. దానిపై పరచి ఉన్న వేలాది కరెన్సీ నోట్లు.. కొంతమంది ఉద్యోగులు వేగంగా వాటిని కట్టకట్టి లెక్కపెడుతున్నారు. ఒకరిని మించి మరొకరు వేగంగా నోట్లను లెక్కిస్తున్నారు. ఇదంతా ఉద్యోగుల విధి నిర్వహణలో భాగం అనుకుంటే పప్పులే కాలేసినట్టే. చైనాకు చెందిన హెనన్ మైనింగ్ క్రేన్ కంపెనీ లిమిటెడ్ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
‘ఏడాది బోనస్ కింద మేము ఇంత మొత్తమని ఇవ్వం. మీరే మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. 15 నిముషాల్లో ఎన్ని కరెన్సీ నోట్లు లెక్కించగలరో ఆ డబ్బంతా మీదే’నని ప్రకటించి, ఒక భారీ టేబుల్‌పై 11 మిలియన్ల సింగపూర్ డాలర్ల కరెన్సీని పరిచింది. ఇంకేముంది.. ఉద్యోగులు పోటీపడి కరెన్సీ నోట్లను లెక్కించారు. ఇందులో ఒక ఉద్యోగి అత్యధికంగా 15 నిమిషాల్లో 86.65 లక్షల రూపాయలను లెక్కపెట్టి బోనస్‌గా సొంతం చేసుకున్నాడు. మిగిలిన వారు కూడా అంత కాకపోయినా వేగంగా కరెన్సీ లెక్కకట్టి లక్షల్లోనే బోనస్‌గా పొందారు.