న్యూయార్క్, ఫిబ్రవరి 15: టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతున్నదని ఆందోళన చెందుతున్న అమెరికాలోని నగరాలు, రాష్ర్టాలు, పాఠశాలల జాబితాలో న్యూయార్క్ నగరం కూడా చేరింది. సామాజిక మాధ్యమాల వల్ల యువత, పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభం తలెత్తుతున్నదని బుధవారం ఆ నగరం కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టులో దావా వేసింది.
మెటా, బైట్‌డాన్స్, గూగుల్, స్నాప్‌చాట్‌లను ప్రతివాదులుగా పేర్కొంది. ఏటా యువత మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, సేవలపై 100 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టు న్యూయార్క్ నగర కార్పొరేషన్ కోర్టుకు తెలిపింది. న్యూయార్క్ సిటీ ఆరోపణలపై మెటా, స్నాప్ చాట్ వంటి సంస్థలు స్పందించాయి. తాము వయసుల వారీగా ప్రజలకు అవసరమైన సురక్షిత కంటెంట్‌ను అందిస్తున్నామని తెలిపాయి.