కీవ్: చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం రియాక్టర్(Chernobyl Reactor)ను రష్యా డ్రోన్ ఢీకొట్టింది. దీంతో రియాక్టర్ షీల్డ్ ధ్వంసమైంది. రష్యాకు చెందిన డ్రోన్ ఈ దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. రియాక్టర్‌లోని నాలుగవ పవర్ యూనిట్‌ను డ్రోన్ ఢీకొట్టింది. ఆ తాకిడితో అక్కడ మంటలు వ్యాపించాయి. అయితే ఆ మంటల్ని ఆర్పేశారు. శుక్రవారం ఉదయం మాత్రం ప్లాంట్ వద్ద రేడియేషన్ లెవల్స్ పెరగలేదని జెలెన్స్కీ తెలిపారు.
పేలుడు జరిగిన కొన్ని క్షణాల్లోనే భద్రతా సిబ్బంది, వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ లోపల, బయట రేడియేషన్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నట్లు ఐఏఈఏ సంస్థ తెలిపింది.
డ్రోన్ అటాక్ ఘటన తర్వాత అటామిక్ ఏజెన్సీ అప్రమత్తంగా ఉన్నది. ఎటవంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం లేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానో గ్రోసీ తెలిపారు. 1986లో చెర్నోబిల్ అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. కాంక్రీట్, స్టీల్‌తో కూడిన షీల్డ్ డ్యామేజ్ అయిన ఫోటోను జెలెన్స్కీ షేర్ చేశారు.