America | వాషింగ్టన్, బొగోటా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల వేటలో కఠినంగా ఉన్నారు. ఆయన ఆదేశాలతో తాజాగా అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు రంగంలోకి దిగారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు న్యూయార్క్, న్యూజెర్సీలలోని గురుద్వారాల్లో తనిఖీలు ప్రారంభించారు. ఈ పరిణామాలు తమ మత పవిత్రతకు భంగకరమని సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిక్కు వేర్పాటువాదులు, అక్రమ వలసదారులకు కొన్ని గురుద్వారాలు అడ్డాగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దవాఖానలు, గురుద్వారాలు, చర్చ్‌లు వంటి పార్థనా స్థలాలను, వాటి సమీప ప్రాంతాలను సున్నితమైనవిగా గతంలో బైడెన్ సర్కారు ప్రకటించింది. అయితే ట్రంప్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆ అదేశాలను రద్దు చేసింది. ఈ పరిణామాలపై సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ ఆదేశాల వల్ల గురుద్వారాలలో తనిఖీలు, అరెస్టులు జరుగుతాయనే భావాన్ని సిక్కులు ఆమోదించలేరని తెలిపింది. ప్రభుత్వ నిఘా వల్ల సిక్కులు గురుద్వారాలకు హాజరు కావడం తగ్గుతుందని, తమ మతపరమైన ఆచారాలను అర్థవంతంగా ఆచరించలేరని ఆవేదన వ్యక్తం చేసింది.
ట్రంప్ హెచ్చరికలతో దిగొచ్చిన కొలంబియా
అమెరికా నుంచి పంపిన అక్రమ వలసదారుల విమానాలను తిప్పి పంపిన కొలంబియాపై అమెరికా ప్రభుత్వం విజయం సాధించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. తమతో దీర్ఘకాలంగా భాగస్వామిగా ఉన్న కొలంబియాపై భారీ దిగుమతి సుంకాలు, ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే కొలంబియా తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలిపింది. తాము పంపిన వలసదారుల విమానాలను స్వీకరించడానికి కొలంబియా అంగీకరించిందని వెల్లడించింది.
ప్రశంసలు పొందిన చోటే ఎగతాళి!
అమెరికాలో ఉన్న భారతీయులను ఆదర్శప్రాయులైన వలసదారులుగా పరిగణిస్తారు. వారిని సమస్యలకు పరిష్కారం చూపేవారిగా వ్యవహరిస్తారు. అయితే, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) మద్దతుదారులు అమెరికాలోని భారతీయులపై సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. హెచ్-1బీ వంటి వీసాలపై వచ్చి, తమకు ఉద్యోగాలు దక్కనీయడం లేదనే అపోహతో మాగా మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో భారతీయులకు వ్యతిరేకంగా అసహనంతో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఇలాంటి ఎగతాళికి కొందరు అమెరికన్లు ఘాటైన సమాధానం ఇచ్చారు. భారతీయులంతా హెచ్-1బీ వీసాలపై వచ్చినవారు కాదని, హెచ్-1బీతో వచ్చినవారంతా భారతీయులు కాదని చెప్పారు.