లండన్, జూన్ 29: కోట్లాది మందిని వేధిస్తున్న టైప్-1 డయాబెటిస్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోని తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ ప్యాంక్రియాస్ కణజాలాన్ని ల్యాబ్‌లో సృష్టించి డయాబెటిస్‌ను నయం చేసే దిశగా సరికొత్త చికిత్స విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆదివారం లండన్ వేదికగా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ప్లాంట్ కాంగ్రెస్-2025’లో సైంటిస్టులు పరిశోధన వివరాల్ని వెల్లడించారు. మధుమేహ చికిత్సలో ఇదొక గేమ్ చేంజర్ అవుతుందని వైద్య నిపుణులు చెప్పారు. బయోప్రింటెడ్ మానవ కణాలు నిజమైన వాటిలాగే ప్రతిస్పందించాయి. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు ఇన్సులిన్ విడుదల చేయటం, చక్కెర తగ్గినప్పుడు ఆగిపోవటం.. శరీర సహజ లయను అనుసరించటం చేశాయి. ఈ సరికొత్త ప్రక్రియ భవిష్యత్తులో రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే అవసరాన్ని తప్పిస్తుందని ప్రధాన సైంటిస్టు డాక్టర్ క్వింటెన్ పియెర్రర్ అన్నారు. మానవ ప్యాంక్రియాస్ కణజాలం నుంచి బయో ఇంక్ ద్వారా త్రీడీ ప్రింటెడ్ కణజాలాన్ని సైంటిస్టులు ల్యాబ్‌లో సృష్టించారు. ఈ త్రీడీ ముద్రిత కణాలను చర్మం కింద ఇంప్లాంట్ చేయటం ద్వారా టైప్-1 డయాబెటిస్‌ను నయం చేయవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు.