మాస్కో: రష్యాకు చెందిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్‌పై తమ సైన్యం పోరాడుతుందని చెచెన్యా అధినేత రంజాన్ కదిరోవ్ (Chechen leader Ramzan Kadyrov) తెలిపారు. యెవ్‌జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ ఆర్మీ తిరుగుబాటును (Russia Armed Mutiny ) అణిచివేస్తామని చెప్పారు. అవరసమైతే కఠిన పద్ధతులను ఉపయోగిస్తామని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సహకరించేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. రొస్తోవ్‌లోని మిలిటరీ ప్రధాన కార్యాలయాన్ని వాగ్నర్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో చెచెన్యా అధినేత రంజాన్ కదిరోవ్ ఈ మేరకు శనివారం ప్రకటించారు. అలాగే ఎలాంటి కవ్వింపులకు పాల్పడవద్దని రష్యా సైనికులకు పిలుపునిచ్చారు.
కాగా, ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు వెన్నుపోటు అని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. దేశ ద్రోహుల నుంచి రష్యాను రక్షించుకుంటామని అన్నారు. సైనిక కుట్రకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే తాము దేశ ద్రోహులం కాదని ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌జనీ ప్రిగోజిన్ తెలిపారు. మాతృభూమిని రక్షించుకునే దేశభక్తులమని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లకు తలొగ్గబోమని అన్నారు. తమ సైన్యం సరెండర్ కాదని స్పష్టం చేశారు. అలాగే త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాబోతున్నాడంటూ ఒక ప్రకటన చేశారు.