వాషింగ్టన్: చాట్‌జీపీటీకి (ChatGPT) దురుసుతనంతో కూడిన ప్రాంప్ట్‌ను ఇచ్చినపుడు దాని పనితీరులో కచ్చితత్వం మెరుగుపడుతుందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీ-4ఓను 250కి పైగా ప్రాంప్ట్‌లతో పరీక్షించారు. వీటిలో అత్యంత మర్యాదకరమైన ప్రాంప్ట్‌ల నుంచి చాలా దురుసుగా ఉండే ప్రాంప్ట్‌ల వరకు ఉన్నాయి. వీటి ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. ఈ అధ్యయన ఫలితాలను ఇంకా పీర్ రివ్యూ చేయలేదు.
ఈ నివేదిక ఫార్చ్యూన్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఈ ఏఐ మోడల్‌కు అమర్యాదకరమైన ప్రాంప్ట్‌లను ఇచ్చినపుడు ఉత్తమంగా పని చేసింది. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ విషయంలో, “ఏయ్ పనోడా, అర్థం చేసుకో” వంటి దురుసుతనంతో కూడిన ప్రాంప్ట్‌లను ఇచ్చినపుడు దీని కచ్చితత్వం రేటు 84.8 శాతం కనిపించింది. అత్యంత మర్యాదతో కూడిన ప్రాంప్ట్‌లను ఇచ్చినప్పటి కన్నా ఇది 4 శాతం ఎక్కువ కచ్చితత్వాన్ని చూపించింది. పెన్ స్టేట్ ప్రొఫెసర్ అఖిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రశ్న అడగటంలో స్వల్ప మార్పుల ప్రభావం ఫలితాలపై చెప్పుకోదగినంతగా ఉంటుందన్నారు.