Pope Francis | క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. స్ట్రోక్‌తో పాటు హృద్రోగ సంబంధిత సమస్య వల్ల పోప్ ఫ్రాన్సిస్ ప్రాణాలు విడిచినట్లు వాటికన్ (Vatican) డాక్టర్లు వెల్లడించారు. కాగా, ప్రజల సందర్శనార్థం (public viewing) పోప్ భౌతిక కాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించారు. మూడు రోజుల పాటు పోప్ పార్థివదేహాన్ని అక్కడే ఉంచి నివాళులర్పించేందుకు ప్రజలకు అవకాశం కల్పించనున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అంశంపై చర్చించేందుకు మంగళవారం ఉదయం రోమ్‌లో కార్డినల్స్ భేటీ జరిగింది. రోమ్‌లో అందుబాటులో ఉన్న కార్డినల్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయానికి సెయింట్ పీటర్స్ బసిలికాకు ఎప్పుడు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలి, అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయాలపై చర్చించారు. పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు ఇవాళ పోప్ భౌతికకాయాన్ని వాటికన్ సిటీలోని తన నివాసం నుంచి సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించారు. ఇక శనివారం ఉదయం 10 గంటలకు (ఇటలీ కాలమానం ప్రకారం) పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read..
“Pope Francis | శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు : వాటికన్”
“Pope Francis | మరణానంతరం పోప్ ఫ్రాన్సిస్ తొలి ఫొటో రిలీజ్ చేసిన వాటికన్”