Fossil Auction | ఇటీవల న్యూయర్క్ నగరంలో నిర్వహించిన వేలంలో ఒక అరుదైన డైనోసార్ శిలాజం వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ప్రపంచ ప్రసిద్ధ సోథ్ బీ సంస్థ నిర్వహించిన ఈ వేలంలో డైనోసార్ శిలాజం 30.5 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ.263 కోట్లు. ఈ శిలాజం వేలం ప్రారంభమైన వెంటనే కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ శిలాజం కోసం కొనుగోలుదారుల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. చివరకు ఈ విలువైన డైనోసార్ శిలాజాన్ని ఓ వ్యక్తిని సొంతం చేసుకున్నారు. అయితే, సంస్థ సదరు వ్యక్తి పేరును రహస్యంగా ఉంచింది.
ఈ శిలాజం జురాసిక్ యుగానికి చెందిందిగా భావిస్తున్నారు. దాదాపు 150 మిలియన్ సంవత్సరాల ప్రాచీనమైన శిలాజంగా అంచనా. ఇది ప్రపంచంలో అత్యధిక ధర పలికిన డైనోసార్ అస్థిపంజరాలలో మూడవ స్థానాన్ని సాధించింది. గత ఏడాది జూలైలో ‘అపెక్స్’ అనే డైనోసార్ శిలాజం 44.6 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.380 కోట్లు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన శిలాజంగా రికార్డులకెక్కింది. ఈ శిలాజం శాస్త్రవేత్తలు, పరిశోధకులకు విలువైన సమాచారం అందించే అవకాశం దక్కనున్నది.