వాషింగ్టన్ : హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz)లో ఇరానీ పోర్టులను సంపూర్ణంగా దిగ్భంధించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. పూర్తి స్థాయిలో నౌకల రాకపోకలను బ్లాక్ చేసినట్లు సెంట్కామ్ అధినేత బ్రాడ్ కూపర్ తెలిపారు. హోర్ముజ్ జలసంధి మార్గంలో జరుగుతున్న ఆర్థిక వాణిజ్యాన్ని పూర్తిగా ఆపేసినట్లు అమెరికా మిలిటరీ పేర్కొన్నది. అమెరికా దళాలు పూర్తి స్థాయిలో ఇతర నౌకలను అడ్డుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దీంతో పశ్చిమాసియాలో తమ మిలిటరీ మారిటైం సుపీరియార్టీ సాధించినట్లు ఆయన చెప్పారు. ఇరానీ పోర్టులను మూసివేసే ప్రక్రియను మొదలుపెట్టిన 36 గంటల్లోనే సంపూర్ణంగా ఆ బ్లాకేడ్‌ను అమలు చేస్తున్నట్లు సెంట్కామ్ పేర్కొన్నది.
ఇరానీ పోర్టుల వద్ద పహారా కాసేందుకు అమెరికాకు చెందిన నేవీ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లను వాడుతున్నారు. ఇరానీ పోర్టుల వద్ద బ్లాకేజ్ మిషన్‌లో భాగంగా డెస్ట్రాయర్లను మోహరించినట్లు తన ఎక్స్ పోస్టులో సెంట్కామ్ పేర్కొన్నది. ఇరానీ తీరం వద్ద లోపలికి ప్రవేశిస్తున్న, బయటకు వెళ్తున్న నౌకలను నిస్పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్ కూపర్ తెలిపారు. అమెరికాకు చెందిన డెస్ట్రాయర్ నౌకలో సుమారు 300 మంది సెయిలర్లు ఉంటారు. మారిటైం ఆపరేషన్స్‌లో వాళ్లు రక్షణాత్మక, ప్రతిదాడి చేపట్టే సామర్థ్యం కలిగి ఉంటారు.
అయితే నిన్న హోర్ముజ్ నుంచి బయలుదేరిన రిచ్ స్టారీ నౌకను మళ్లీ ఇరానీ పోర్టుకు వెనక్కి పంపారు.