వాషింగ్టన్, నవంబర్ 30: వంకర టింకరగా ఉండే వెంట్రుకలను నిటారుగా చేసేందుకు ఉపయోగించే హెయిర్ స్ట్రెయిట్నర్ రసాయనాల వల్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఆ రసాయనాలను ఉపయోగించని మహిళల కన్నా ఉపయోగించేవారికి ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని అమెరికా జాతీయ వైద్య సంస్థ జరిపిన సర్వేలో తేలింది. 34-75 సంవత్సరాల మధ్య వయసుగల 33,497 మంది మహిళలపై ఈ అధ్యయనం జరిపారు. అయితే వెంట్రుకలకు వేసుకునే రంగులు, డైల వల్ల ఈ ముప్పు అంతగా ఉండదని తెలిసింది. 11 సంవత్సరాల పాటు సర్వే జరుపగా 378 మంది మహిళల్లో గర్భాశయం క్యాన్సర్ బైటపడిందని సర్వే నిర్వాహకులు తెలిపారు.
వెంట్రుకలను నిటారుగా చేసేందుకు ఉపయోగించే రసాయనాల్లో ప్యారాబెన్స్, బిస్ఫెనాల్ ఏ, భారలోహాలు గర్భాశయ క్యాన్సర్కు కారణమవుతాయని పేర్కొన్నారు. నల్లజాతి మహిళలు ఉంగరాల జుత్తును నిటారుగా మలచుకొనేందుకు ఈ రసాయనాలు ఎక్కువగా వాడుతారు కనుక వారికే ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.