ఒట్టావా: తమ గడ్డపై ఖలిస్థానీ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న మాట నిజమేనని కెనడా తొలిసారిగా అంగీకరించింది. భారత దేశం గూఢచర్యానికి పాల్పడుతున్నదని, తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని ఇన్నాళ్లు కెనడా విమర్శిస్తూ వచ్చింది.
అయితే భారత్ మొదటి నుంచి ఆరోపించిన విధంగా కెనడా కేంద్రంగా భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థానీ తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంటూ ఆ దేశ ప్రధాన నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) పార్లమెంట్‌కు నివేదిక సమర్పించింది. ఖలిస్థానీ అనుకూలవాదులు కెనడా కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఆ దేశంలో ఉన్న వేర్పాటువాదులకు నిధులు సమకూరుస్తుండటమే కాక, హింసాత్మక ఘటనలకు ప్రణాళికలు వేస్తున్నారని పేర్కొంది.