టొరంటో, నవంబర్ 22 : తప్పుడు ధ్రువ పత్రాలతో మోసపూరితంగా తమ దేశంలో విద్యను అభ్యసించడానికి వచ్చిన 10 వేల మంది విదేశీ విద్యార్థులను కెనడా ప్రభుత్వం గుర్తించింది. వీరు మోసపూరిత విద్యార్థి అంగీకార లేఖలు సమర్పించి తమ దేశంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారని ఇమ్మిగ్రేషన్ రిఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్సీసీ) పేర్కొన్నట్టు కెనడా డైలీ గ్లోబ్ అండ్ మెయిల్ తెలిపింది. ఆ దేశంలో అమలులో ఉన్న కఠిన నిబంధనల మేరకు 2024లో 5 లక్షల మంది విదేశీ విద్యార్థులు సమర్పించిన దరఖాస్తులు, పత్రాలను పరిశీలించారు. ఇందులో 10 వేల మంది విద్యార్థులు నకిలీ ధ్రువపత్రాలతో తమ దేశానికి వచ్చినట్టు గుర్తించారు. వీరిలో 80 శాతం మంది భారత్‌లోని గుజరాత్, పంజాబ్‌లకు చెందిన వారే. భారత్‌లో లైసెన్స్ లేని కన్సల్టెన్సీలు, విద్యా సంస్థల ద్వారా జారీ చేసిన లేఖల ద్వారా కొంతమంది భారత విద్యార్థులు అడ్మిషన్లు పొందిన విషయం 2023లోనే బయటపడింది. అప్పట్లో వారు దేశ బహిష్కరణ భయాన్ని కూడా ఎదుర్కొన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన కఠినతరం చేయడంతో ఈ ఏడాది 10 వేల మంది అక్రమ పత్రాల ద్వారా ప్రవేశం పొందినట్టు గుర్తించారు. ఇలా నకిలీ ధ్రువ పత్రాలతో అడ్మిషన్లు పొందడం పట్ల అక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.