Canada | ఒట్టావా, అక్టోబర్ 7: పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ (పీజీడబ్ల్యూపీ) ప్రోగ్రామ్లో నవంబర్ 1 నుంచి మార్పులు అమలు చేయనున్నట్టు కెనడా ప్రభుత్వ సంస్థ ఐఆర్సీసీ వెల్లడించింది. అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు పీజీడబ్ల్యూపీకి అవసరమైన భాషా నైపుణ్యాలపై ఆధారాలు సమర్పించాలి. ఇంగ్లిష్ భాష కోసం కెనడియన్ లాంగ్వేజెస్ బెంచ్మార్క్(సీఎల్బీ)ను ఆధారంగా సమర్పించొచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా చదవడం, రాయడం, వినడం, మాట్లాడే విభాగాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించాలి.
ఇందుకు సంబంధించి రెండేండ్ల లోపు పాత పరీక్ష ఫలితాలను మాత్రమే దరఖాస్తుతో పాటు జత పరచాలి. అదనంగా అభ్యర్థి తాను చదవాలనుకుంటున్న స్టడీ ప్రోగ్రామ్ కోసం, అందుకు సంబంధించిన వృత్తికి సంబంధం ఉన్న రంగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అభ్యర్థి చదవాలనుకున్న రంగాలను వ్యవసాయం & వ్యవసాయోత్పత్తి వాణిజ్యం(అగ్రి-ఫుడ్), స్టెమ్ సబ్జెక్టులు, వాణిజ్యం, రవాణా అనే అయిదు విభాగాలుగా విభజించారు. పీజీడబ్ల్యూపీ ప్రోగ్రామ్లో కొత్త నిబంధనలతో పాటు కొన్ని పాత నిబంధనలను కూడా అమల్లో ఉంటాయి. పీజీడబ్ల్యూపీకి అర్హత పొందేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా జనరల్, ఫిజికల్ లొకేషన్ అర్హతలను సాధించాలి.