Canada | టొరంటో, నవంబర్ 9: భారత్ సహా 14 దేశాల విదేశీ విద్యార్థులకు కెనడా షాకిచ్చింది. విద్యార్థులకు వేగంగా స్టడీ వీసా ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్) విధానాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాటు నైజీరియా విద్యార్థులకు వేగంగా వీసా కల్పించే నైజీరియా స్టూడెంట్ ఎక్స్ప్రెస్(ఎన్ఎస్ఈ) విధానాన్ని కూడా ఆపేసింది. ‘విద్యార్థులందరికీ దరఖాస్తు ప్రక్రియలో సమాన అవకాశాన్ని, పారదర్శక విధానాన్ని, సానుకూల విద్యా అనుభవాన్ని అందించేందుకు ఎస్డీఎస్, ఎన్ఎస్ఈ కార్యక్రమాలను తక్షణం నిలిపివేస్తున్నాం.’ అని కెనడా ప్రభుత్వం ప్రకటించింది.
ఇక నుంచి విద్యార్థులంతా సాధారణ స్టడీ పర్మిట్ విధానం ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, అంతర్జాతీయ విద్యార్థులను స్వాగతిస్తూనే ఉంటామని పేర్కొన్నది. ఎస్డీఎస్, ఎన్ఎస్ఈ కింద శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల లోగా దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఆర్థికపరమైన సవాళ్లు, ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి, పెరుగుతున్న జీవనవ్యయం, ఇండ్ల లభ్యత తగ్గిపోవడం వంటి కారణాలతో దేశంలోకి వలసలను తగ్గించేందుకు కెనడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఎస్డీఎస్ విధానం రద్దు చేయడం కెనడాకు వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇంతకుముందు ఎస్డీఎస్ ద్వారా మన విద్యార్థులకు వేగంగా కెనడా స్టడీ వీసాలు దక్కేవి. ఇక నుంచి భారతీయ విద్యార్థులు సాధారణ విధానం ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వీసా కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కాగా, కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య దాదాపు 35 శాతం వరకు ఉంటుంది.