న్యూఢిల్లీ, డిసెంబర్ 22: తన దేశానికి వలసవచ్చిన పారిశ్రామికవేత్తలకు కొత్త వీసా కార్యక్రమాన్ని తయారు చేసేందుకు వీలుగా కెనడా తన బిజినెస్ ఇమిగ్రేషన్ వ్యవస్థలో కొంత భాగాన్ని నిలిపివేస్తోంది. స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులకు అందుబాటులో ఉన్న ఆప్షనల్ వర్క్ పర్మిట్ దరఖాస్తుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ఇమిగ్రేషన్, రిఫ్యూజీ అండ్ సిటిజెన్షిప్ కెనడా(సీఆర్సీసీ) డిసెంబర్ 19న ప్రకటించింది. కెనడాలో ఇప్పటికే ఉండి ప్రస్తుత తమ స్టార్ట్-అప్ వీసా పర్మిట్‌ని పొడిగించుకునేందుకు చేస్తున్న దరఖాస్తులకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ఐఆర్సీసీ తెలిపింది. డిసెంబర్ 11వ తేదీ అర్ధరాత్రి నుంచి కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుల స్వీకరణను నిలిపేసినట్లు ఐఆర్సీసీ వెల్లడించింది.
అయితే ఇందులో కొంత మినహాయింపు ఉందని, 2025లో ఏదైనా సంస్థ నుంచి హామీ పొంది ఇంకా దరఖాస్తు చేయని వారు మాత్రం 2026 జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. తమ స్టార్-అప్ వీసా ప్రోగ్రామ్ని పునఃసమీక్షిస్తున్నట్లు ఐఆర్సీసీ గత నెల తెలిపింది. కాగా, స్టార్ట్-అప్ వీసా ప్రోగ్రామ్‌కు 2025లో ప్రాసెసింగ్ సమయం ఎక్కువగా ఉంది. పర్మనెంట్ రెసిడెంట్స్‌గా మారేందుకు కొందరు పారిశ్రామికవేత్తలకు పదేండ్లకు పైగా సమయం పడుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఏండ్ల తరబడి ఎదురుచూపులతో విసిగిపోయిన పలువురు స్టార్ట్-అప్ ఫౌండర్లు కెనడాను వీడుతున్నారు. వీరిలో ఈటాన్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యుటివ్ మాలిక్ పాండ్య ఒకరు.
కెనడాను విడిచిపెట్టాలని ఎంతో వేదనతో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాని పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే అవకాశం లేకపోవడంతో ఇక భారత్ లేదా యూఏఈకి వెళ్లి అక్కడే తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందివ్వాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. ఇది పాండ్య ఒక్కరి వేదనే కాదు. ఇలాంటి వారు వందల్లో ఉన్నారు. కంపెనీలు నిర్మించి, పెట్టుబడులు సృష్టించి తమ కుటుంబాలకు కెనడాలో శాశ్వత నివాసాన్ని సంపాదించాలని కలలు కన్న ఎందరో స్టార్-అప్ ఫౌండర్లు తట్ట బుట్టా సర్దుకుని కెనడాకు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
జీతం లేని సెలవులో ఉన్నాం.. హెచ్-1బీ వీసా రెన్యువల్‌కు వచ్చి చిక్కుకున్న భారతీయుల ఆవేదన
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా రెన్యువల్ అపాయింట్మెంట్లు రద్దు, వాయిదా నిర్ణయం వేలాది మంది భారతీయులకు క్షోభను మిగిల్చింది. వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చిన పలువురు ఇక్కడే చిక్కుకుపోయి, అమెరికా వెళ్లలేని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది తమకు విషమ పరీక్ష అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ విధానాన్ని ట్రంప్ యంత్రాంగం విస్తరించిన క్రమంలో అంతకు ముందు అత్యున్నత నిపుణులైన ఉద్యోగుల వీసా రెన్యువల్‌కు డిసెంబర్ 15 నుంచి 26 వరకు ఇచ్చిన అపాయింట్మెంట్లను రద్దు చేశారు.
దీంతో ఆయా తేదీల రెన్యువల్ కోసం ఇక్కడికు వచ్చిన వారు తిరిగి యూఎస్ వెళ్లలేని పరిస్థితిలో ఇక్కడే చిక్కుకుపోయారు. హూస్టన్ కేంద్రంగా ఉండే ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, హెచ్-1బీ, హెచ్-4 వీసా కోరుకునేవారు సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని భారత్‌లోని అమెరికా ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. వీటి స్క్రీనింగ్ ప్రక్రియకు దీర్ఘకాలం పట్టే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.