వాషింగ్టన్, అక్టోబర్ 5: అమెరికాలోని ఒరేగాన్ హెల్త్, సైన్స్ వర్సిటీ అద్భుతమైన ఘనత సాధించింది. వర్సిటీలోని శాస్త్రవేత్తలు చర్మకణాల నుంచి మానవ పిండాన్ని అభివృద్ధి చేసే దిశగా కీలక మైలురాయిని దాటారు. మనిషి చర్మ కణంలోని కేంద్రకాన్ని తీసుకుని, దాత అండంలోకి ప్రవేశపెట్టడం ద్వారా సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిలో పిండం ఆరంభ దశను సృష్టించారు. చర్మ కణంలోని డీఎన్ఏను దాత అండంలోకి ప్రవేశపెట్టడాన్ని సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తారు.
మొత్తం 82 అండాలను తయారు చేయగా వీటిలో 8 వరకు పిండం ఆరంభ దశ అయిన బ్లాస్టోసిస్ట్ దశ వరకు అభివృద్ధి చెందగలిగాయి. ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు అండాలలోని క్రోమోజోమ్ల సంఖ్యను సగానికి తగ్గించడం అనే మైటోమియాసిస్ దశను ఉపయోగించారు. తయారు చేసిన పిండాలలో కొన్నింటిలో జన్యుపరమైన సమస్యలు ఉన్నాయని, మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. తక్కువ అండాలు కలిగిన వారు, క్యాన్సర్ బాధితులు, స్వలింగ దంపతులు సొంత జన్యుపరమైన సంతానాన్ని పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు.