న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వాలని కంబోడియా ప్రధాని(Cambodia PM) హున్ మానెట్ డిమాండ్ చేశారు. తన ఫేస్బుక్ పోస్టులో ఆయన ఈ ప్రకటన చేశారు. థాయిల్యాండ్‌తో సరిహద్దు సమస్యను పరిష్కరించడంతో అసాధారణ రాజనీతిని ట్రంప్ ప్రదర్శించినట్లు హున్ తన స్టేట్మెంట్లో తెలిపారు. శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేయాలంటూ నార్వే నోబెల్ కమిటీకి లేఖ రాశారు. కొన్ని దేశాల్లో ఉన్న ఉద్రిక్తతలను ట్రంప్ పరిష్కరించినట్లు ఆ లేఖలో ఆయన తెలిపారు. ట్రంప్ జోక్యం వల్లే తీవ్ర సంక్షోభం నుంచి తప్పించుకున్నామని, ప్రాణ నష్టం జరగకుండా చేశాడని, శాంతి స్థాపనకు ప్రయత్నించారని కంబోడియా నేత తెలిపారు.
థాయిల్యాండ్, కంబోడియా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను ట్రంప్ తొలగించారని, జూలై 26వ తేదీన ఆయన చర్చలు జరిపినట్లు చెప్పారు. ట్రంప్ జోక్యం వల్లే జూలై 28వ తేదీన రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్నారు. థాయ్, కంబోడియా మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 43 మంది మరణించారు. మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. థాయ్‌కి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు.. కంబోడియాలో ఉన్న శివాలయాలను టార్గెట్ చేస్తూ బాంబులు వేసింది. అయిదు రోజుల పాటు ఆ రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణ నెలకొన్నది.
ట్రంప్‌కు నోబెల్ శాంతి అవార్డు ఇవ్వాలని ఇప్పటికే పాకిస్థాన్, ఇజ్రాయిల్ దేశాలు అభ్యర్థన చేశాయి.