లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన విషయాన్ని ప్రస్తావించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వినియోగించిన తర్వాత తన బాత్రూమ్లో బగ్గింగ్ పరికరాన్ని (Bugging device) గుర్తించినట్లు పేర్కొన్నారు. తన పుస్తకం అన్లీషెడ్లో ఈ విషయాన్ని ఆయన రాశారు. 2017లో బోరిస్ జాన్సన్ బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాడు తొలిసారి బ్రిటన్‌లో పర్యటించారు. లండన్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్ వ్యక్తిగత టాయిలెట్‌ను నెతన్యాహు వినియోగించారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా వినే పరికరాలను బాత్రూమ్లో కనుగొన్నారని తన బుక్‌లో బోరిస్ జాన్సన్ రాశారు.
కాగా, స్నేహపూర్వక దేశాలపై కూడా ఇజ్రాయెల్ నిఘా ఉంచినట్లుగా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. 2019లో అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ సమీపంలో, వాషింగ్టన్ చుట్టుపక్కల ఉన్న సున్నితమైన ప్రదేశాల్లో సెల్‌ఫోన్ నిఘా పరికరాలను గుర్తించారు. వీటి వెనుక ఇజ్రాయెల్ పాత్ర ఉండవచ్చని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. దీనిని నమ్మడం కష్టంగా ఉందని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను నెతన్యాహు ఖండించారు.