Britain’s King Charles | కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3కి అవమానం ఎదురైంది. ఆయన తమ రాజు కాదంటూ ఆస్ట్రేలియా ఆదివాసీ సెనెటర్ ఒకరు గట్టిగా నినాదాలు చేయటంతో కింగ్ చార్లెస్-3 షాక్‌కు గురయ్యారు. సోమవారం కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అధికారికంగా ఆస్ట్రేలియాకు పాలకుడైన ఆయన, పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే ఆస్ట్రేలియా ఆదివాసీ సెనెటర్ లిడియా థోర్పే రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. బ్రిటిష్ వలసదారులు తమ దేశంలోని ఆదివాసీల భూములు లాక్కున్నారని, తమపై నరమేధానికి పాల్పడ్డారని థోర్పే ఆరోపించారు. ‘మా నుంచి దోచుకున్నదంతా మాకు ఇచ్చేయండి. ఇది మీ భూమి కాదు. మీరు మా రాజు కాదు’ అంటూ దాదాపు నిమిషానికిపైగా పెద్ద గొంతుతో నినాదాలు చేశారు. 2022లో సెనెటర్‌గా ఎన్నికైన ఆమె వలస విధానాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్-2ను దేశాధినేతగా కొనసాగించాలని 1999 రెఫరెండంలో ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కింగ్ చార్లెస్-3 ఆస్ట్రేలియాకు రాజుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా, సమావో దేశాల్లో 9 రోజుల పర్యటన చేపట్టారు.