కీవ్: ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రికత్తలు నెలకొన్న విషయం తెలిసిందే. చాన్నాళ్ల నుంచి ఆ బోర్డర్ రగులుతోంది. ఇటీవల సుమారు లక్ష మంది దళాలను ఆ సరిహద్దు వద్ద రష్యా మోహరించింది. దీంతో ఉక్రెయిన్‌కు అండగా నాటో దళాలు రంగంలోకి దిగుతున్నాయి. రష్యా తన వైపు ఉన్న భూభాగంలో అనేక మిస్సైళ్లను కూడా ఎక్కుపెట్టింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు బ్రిటన్ ముందుకు వచ్చింది. తమ వద్ద ఉన్న స్వల్ప శ్రేణి యాంటీ ట్యాంక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు బ్రిటన్ పంపింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ తెలిపారు. ఉక్రెయిన్ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు కూడా బ్రిటన్ సైన్యాన్ని పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. రష్యా బలగాలు అక్రమ రీతిలో ఉక్రెయిన్‌లో చొరబడే అవకాశాలు ఉన్నాయని, ఆ ఆందోళనల నేపథ్యంలో రక్షణాత్మక చర్యల్లో భాగంగా యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను పంపినట్లు బ్రిటన్ మంత్రి తెలిపారు. అయితే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలవడాన్ని రష్యా తప్పుపట్టింది.