Brain Implant | లండన్, జనవరి 20: పుర్రె లోపల ఒక చిప్‌ను అమర్చి అల్ట్రాసౌండ్ ద్వారా మెదడును నియంత్రించే అధునాతన ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. బ్రెయిన్-కంప్యూటర్-ఇంటర్ఫేస్(బీసీఐ)గా పిలిచే ఈ సాంకేతికతతో అమెరికాకు చెందిన ఫారెస్ట్ న్యూరోటెక్ అనే సంస్థ ఒక బ్రెయిన్ చిప్(ఇంప్లాంట్)ను తయారుచేసింది. ఇప్పటివరకు ఉన్న బీసీఐ ఇంప్లాంట్లను వినియోగించేందుకు ఎలక్ట్రోడ్లను నేరుగా మెదడులోకి పంపించాల్సి ఉంటుంది. ఈ కొత్త చిప్‌ను మాత్రం పుర్రె కింద, మెదడు బయట అమరుస్తారు. దీని ద్వారా మెదడు పనితీరును సమగ్ర 3డీ మ్యాప్‌లుగా రూపొందించవచ్చు.
ఆ తర్వాత అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా మెదడులోని నిర్దిష్ట న్యూరాన్ల సమూహాన్ని శాస్త్రవేత్తలు బయటినుంచి యాంత్రికంగా ఉత్తేజపరుస్తారు. తద్వారా ఆందోళన, నిరాశ, మూర్చ వంటి సమస్యలను దూరం చేయవచ్చని, మూడ్‌ను మార్చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ చిప్‌పై ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) మార్చి నుంచి మనుషులపై ప్రయోగాలు జరపనుంది. ఇప్పటికే వివిధ మెదడు సర్జరీలు చేయించుకున్న వారిపై ప్రయోగాలు జరగనున్నాయి. వీరికి సర్జరీ కోసం ఇప్పటికే కొంతభాగం పుర్రె తొలగించి ఉంటుంది కాబట్టి వీరిపై ప్రయోగాలు చేయనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. మూడేండ్ల పాటు ప్రయోగాలు జరగనున్నాయి.