Rishi Sunak | బ్రిటన్ ప్రధాని పదవికి ప్రధాన పోటీదారులుగా రిషి సునాక్, లిజ్ ట్రస్ నిలిచారు. రాజీనామా చేసిన ప్రధాని బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా రిషి సునాక్.. తన నాయకుడిని వెన్నుపోటు పొడుస్తున్నారన్న సంకేతాలిచ్చే మీమ్ సోషల్ మీడియాలో విడుదలైంది. దీన్ని బ్రిటన్ సాంస్కృతిక శాఖ మంత్రి నాడిన్ డోరిస్ తన ట్విట్టర్ ఖాతాలో రీ ట్వీట్ చేశారు. ఆమె బోరిస్ జాన్సన్‌కు విధేయురాలు అని పేరు ఉంది.
బోరిస్ జాన్సన్ తాను ప్రధానిగా వైదొలగడానికి రిషి సునాక్ కారణం అని, సునాక్ తనకు వెన్నుపోటు పొడిచాడని అన్నట్లు వార్తలొచ్చాయి. రిషి సునాక్ తప్ప, మిగతా వారెవ్వరినైనా ప్రధానిగా ఎన్నుకోవాలని టోరీ పార్టీ సభ్యులకు బోరిస్ జాన్సన్ సూచించారు. ప్రస్తుతం రిషి సునాక్ కంటే లీడ్‌లో ఉన్న లిజ్ ట్రస్‌కు బోరిస్ జాన్సన్ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.
ఇటువంటి మీమ్ ట్వీట్ చేసిన మంత్రి నాడిస్ డోరిస్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిషి సునాక్ మద్దతుదారైన వాణిజ్య మంత్రి గ్రేగ్ హ్యాండ్స్ స్పందిస్తూ.. ఈ పోస్ట్ భీతి గొల్పుతున్నదన్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ కత్తిపోట్లతో హత్యకు గురై ఏడాది దాటలేదన్నారు. ఇటువంటి పోస్ట్‌లు పంచుకోవడం చాలా ప్రమాదకర, చెడు ఆలోచన అని వ్యాఖ్యానించారు. 2021లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ డేవిడ్ అమీస్పై ఓ వ్యక్తి కత్తిపోట్లకు దిగడంతో ఆ ఎంపీ మరణించిన సంగతి తెలిసిందే.
సాధారణ ఎన్నికల సమయంలో మాదిరిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నదని ఓ అధికార పార్టీ నేత చెప్పారు. కానీ ప్రధాని పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓట్లేసేది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులేనన్నారు. డోరిస్ మద్దతుదారు ఒకరు స్పందిస్తూ.. ఇది ఒక సెటైర్ చిత్రం వంటిదని దాట వేయడానికి ప్రయత్నించారు. ఇంతకుముందు కూడా రిషి సునాక్‌పై డోరిస్ విమర్శలు గుప్పించారు. బోరిస్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు రిషి సునాక్ సారధ్యం వహించారని ఆరోపించారు.