Boeing | సియాటెల్ (అమెరికా): ప్రముఖ విమానాల తయారీ సంస్థ ‘బోయింగ్’ 17 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో 10 శాతానికి సమానం. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వల్ల ఆ కంపెనీ షేర్ల విలువ 1.1% క్షీణించింది. అమెరికాలో 33 వేల మంది బోయింగ్ ఉద్యోగులు నెల రోజుల నుంచి సమ్మెను కొనసాగిస్తుండటంతోపాటు 737 మ్యాక్స్, 767, 777 జెట్ విమానాల తయారీని నిలిపివేయడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆ సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్బెర్గ్ తమ సిబ్బందికి పంపిన సందేశంలో స్పష్టం చేశారు. సమ్మె వల్ల మూడో త్రైమాసికంలో సంస్థకు 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.42,068 కోట్ల) నష్టం వాటిల్లినట్టు వెల్లడించారు. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను కుదించడం అనివార్యమని, తెలిపారు.