సియాటిల్: అమెరికాలోని బోయింగ్ సంస్థలో(Boeing Lays Off) భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించారు. వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్న అదనపు ఉద్యోగుల్ని తీసివేశారు. సుమారు 17 వేల మందిని తొలగించే పనిలో బోయింగ్ సంస్థ ఉన్నది. వాషింగ్టన్ రాష్ట్రంలో 400 మంది, కాలిఫోర్నియా రాష్ట్రంలో 500 మంది బోయింగ్ ఉద్యోగుల్ని తొలగించారు. ఆర్థికపరమైన, రెగ్యులేటరీ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆ సంస్థ ఉద్యోగుల్ని క్రమపద్ధతిలో తొలగించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
రాబోయే కొన్ని నెలల్లో సుమారు పది శాతం మంది ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవంబర్లోనే ఉద్యోగులకు సమాచారాన్ని అందజేశామని సీఈవో కెల్లి ఓర్ట్బర్గ్ తెలిపారు. ఇంజినీర్ల నుంచి రిక్రూటర్ల వరకు, విశ్లేషకులను కూడా తొలగించినట్లు చెప్పారు. దీని వల్ల కమర్షియల్, డిఫెన్స్, గ్లోబల్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోందన్నారు.
తొలగించిన ఉద్యోగులు.. పేరోల్‌లో రెండు నెలల పాటు ఉంటారన్నారు. వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్సు లాంటి సౌకర్యాలు మరో మూడు నెలలు పాటు ఉంటాయన్నారు. 2018, 2019 సంవత్సరాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిపోవడం వల్ల ఆర్లింగ్టన్, వర్జీనియాలోని సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.