శనివారం 06 మార్చి 2021
International - Jan 17, 2021 , 13:04:52

అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరో తెలుసా..?

అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరో తెలుసా..?

న్యూయార్క్‌ : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, ప్రపంచంలో నాలుగవ ధనవంతుడిగా ఉన్న బిల్ గేట్స్.. అమెరికా 'అతిపెద్ద రైతు'గా అవతరించారు. అమెరికాలోని 18 రాష్ట్రాల్లో మొత్తం 2 లక్షల 42 వేల ఎకరాల సాగు భూమి బిల్‌ గేట్స్‌ పేరిట ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. బిల్‌ గేట్స్‌ సాగు భూమిలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా.. ఇతర రకాల భూమిని కూడా కొనుగోలు చేశారు. హార్స్ హెవెన్ హిల్స్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 14,500 ఎకరాలు వీటిలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.1,251 కోట్లు చెల్లించారు. మొత్తం మీద బిల్‌ గేట్స్‌ ఇప్పటివరకు మొత్తం 2,68,984 ఎకరాలను కొనుగోలు చేశారు.

అయితే, 65 ఏండ్ల వయసున్న బిల్ గేట్స్ ఇంత వ్యవసాయ భూమిని ఎందుకు కొన్నారో స్పష్టంగా తెలియలేదు. కానీ, భూమిని నేరుగా, వ్యక్తిగత 'ఇన్వెస్ట్‌మెంట్ ఎంటిటీ క్యాస్కేడ్' సంస్థ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. 2018 లో బిల్ గేట్స్ ఈ భూములను కొనుగోలు చేసినప్పుడు అవి ఆ సంవత్సరంలో యూఎస్‌లో అత్యధికంగా కొనుగోలు చేసిన భూమిగా రికార్డులో నిలిచింది. కాస్కేడ్ ముఖ్య పెట్టుబడి అధికారిగా పనిచేస్తున్న మనీ మేనేజర్ మైఖేల్ లార్సన్.. 2014 వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రొఫైల్‌లో గేట్స్ భారీ వ్యవసాయ హోల్డింగ్స్ గురించి సూచన చేశారు. ఈ సంస్థ "కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, అయోవా, లూసియానాతోపాటు ఇతర రాష్ట్రాలలో కనీసం 1,00,000 ఎకరాల వ్యవసాయ భూములను కలిగి ఉన్నది- లేదా మాన్‌హట్టన్ కంటే ఏడు రెట్లు పెద్ద ప్రాంతం" అని పేర్కొన్నారు. 2017 లో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ యాజమాన్యంలోని యూఎస్ వ్యవసాయ భూములను బిల్‌ గేట్స్ 520 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. అగ్రికల్చరల్ కంపెనీ ఆఫ్ అమెరికాకు చెందిన ఈ భూములను 2013 లో స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ డుక్వెస్నే క్యాపిటల్ మేనేజ్‌మెంట్, గోల్డ్‌మన్ సాచ్స్ 2007 లో ప్రారంభించిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్.

ఫౌండేషన్‌ లక్ష్యాల్లో వ్యవసాయం

బిల్‌ గేట్స్, అతని భార్య మెలిండా నడుపుతున్న భారీ స్వచ్ఛంద సంస్థ బిల్ అండ్‌ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు వ్యవసాయం కూడా ఒక ప్రధాన కేంద్రం. సబ్‌-సహారన్‌ ఆఫ్రికా, దక్షిణ ఆసియా అంతటా వ్యవసాయ పరివర్తనకు మద్దతు ఇవ్వడం ఈ ఫౌండేషన్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. బిల్ అండ్‌ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 2008 లో ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆఫ్రికాతోపాటు ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని చిన్న రైతులకు రూ.2,238 కోట్ల సహాయాన్ని ఇస్తున్నామని, తద్వారా చిన్న రైతులు ఆకలి, పేదరికం నుంచి బయటపడగలరని పేర్కొన్నది. ఇలా ఉండగా, లిబర్టీ మీడియా చైర్మన్‌ జాన్‌ మలోన్‌కు అమెరికాలో 2.2 మిలియన్ ఎకరాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇవి కూడా చదవండి..

భారత రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo