న్యూయార్క్, జనవరి 4: అమెరికాను 2005లో కుదిపేసిన ‘ఎప్‌స్టెయిన్ ఫైల్స్’ సెక్స్ కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్స్ కుంభకోణంలో ఆ దేశ మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌తోపాటు స్టీఫెన్ హాకింగ్,మైఖేల్ జాక్సన్, ప్రిన్స్ ఆండ్రూ సహా 200 మంది పేర్లు బయటికి వచ్చాయి. ఈ కేసులో లైంగిక నేరస్థుడు జెఫీ ఎప్‌స్టెయిన్ కోర్టుకు తెలిపిన సమాచారాన్ని గతంలో సీజ్ చేశారు. ఆ ఫైల్‌ను తాజాగా న్యూయార్క్ జడ్జి తెరవటంతో అనేక మంది ఆ దేశ ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి.
మొత్తం వెయ్యి పేజీల స్టేట్మెంట్లకు గానూ ఇందులో న్యూస్ పేపర్ల కథనాలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. ఈ ఫైల్స్ పూర్తి వివరాలను అప్పట్లో బయటపెట్టలేదు. తాజాగా, జనవరి 1న న్యూయార్క్ కోర్టు సీజ్ పత్రాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నది. తొలి విడతగా బుధవారం 40 పత్రాలను విడుదల చేసింది. ఇందులో వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఎప్‌స్టెయిన్ ఫైల్స్ అమెరికాను కుదిపేస్తున్నది. పైగా, ఈ కుంభకోణంలో అంతా అత్యున్నత స్థాయి వ్యక్తులే ఉన్నారు.