ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనర్జీ భుట్టో కుమారుడు బిలావాల్ భుట్టో(Bilawal Bhutto Zardari) తాజాగా జరిగిన ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో లాహోర్-ఎన్ఏ127 స్థానం నుంచి ఓడారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావాల్ భుట్టో.. పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు చెందిన అత్తావుల్లా తారార్ చేతిలో పరాజయం చవిచూశారు. తరార్‌కు 98,210 ఓట్లు పోలవ్వగా, బిలావాల్ కేవలం 15 వేల ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. అయితే ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు పీపీపీ పార్టీ ఆరోపిస్తున్నది.
ఓ దశలో బిలావాల్ లీడింగ్‌లో ఉన్నారని, అకస్మాత్తుగా ఎన్నికల ఫలితాలను ఆపేశారని, ఆ తర్వాత ప్రత్యర్థి లీడింగ్‌లోకి వెళ్లినట్లు పీపీపీ నేత రెహ్మాన్ ఆరోపించారు. రిగ్గింగ్ వల్లే ఎన్నికల ఫలితాలను జాప్యం చేశారని కూడా ఆమె ఆరోపించారు. పోలింగ్ రోజున మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారని రెహ్మాన్ తెలిపారు. దీని వల్ల ఓటర్లకు, అభ్యర్థులకు సమస్యలు తలెత్తినట్లు ఆమె వెల్లడించారు. రిగ్గింగ్ కోసం మొబైల్ సేవల్ని నిలిపివేశారని ఆమె ఆరోపించారు.
తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కూడా జలక్ తలిగింది. పీఎంఎల్-ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ కూడా ఓటమి చవిచూశారు. మన్షీరా నియోజకవర్గంలో ఆయన ఓడారు. ఆ స్థానం నుంచి పీటీఐ మద్దతుదారుడు విజయం సాధించారు. అయితే లాహోర్ ఎన్ఏ నియోజకవర్గం నుంచి మాత్రం పీటీఐ అభ్యర్థి యస్మిన్ రషీద్‌పై నవాజ్ షరీఫ్ గెలుపొందారు.