న్యూఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) ఎక్కడున్నాడో తమకు తెలియదని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, పీపీపీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో (Bilawal Bhutto) అన్నారు. పాక్ గడ్డపై ఉన్నాడని భారత్ సమాచారం ఇస్తే తాము అతన్ని సంతోషంగా అరెస్టు చేస్తామని తెలిపారు. అతని గతాన్ని బట్టి చూస్తే అఫ్ఘానిస్థాన్‌లో ఉండొచ్చని వెల్లడించారు.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన మసూద్ అజార్‌తోపాటు, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది. వారు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, పాక్ మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా నడుచుకుంటున్నది. ఈ నేపథ్యంలో హఫీస్ సయీద్ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్న వార్తలను భుట్టో కొడ్డిపడేశారు. అతడు ప్రస్తుతం పాక్ జైలులో ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఇక మసూద్ విషనికొస్తే.. అతన్ని తాము అరెస్టు చేయలేకోయామని చెప్పారు. అతని గతాన్ని బట్టి చూస్తే అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నామని అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అఫ్ఘాన్‌లో నాటో సైన్యం చేయలేని పనని తాము చేయాలేమన్నారు. అతన్ని పట్టుకుంటే భారత్ కంటే ఎక్కువగా తామే సంతోషిస్తామని వ్యాఖ్యానించారు.
మసూద్ అజార్ భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉద్రవాదుల్లో ఒకరు. హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టిన అజార్.. 2000లో జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అయితే 1994లో మసూద్‌ని అరెస్టు చేసిన భారత ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1999లో అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC-814 విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అజార్‌తోపాటు మరో ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత 2001 భారత పార్లమెంట్‌పై దాడి, 2002లో డానియల్ పెరల్ కిడ్నాప్.. హత్య, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటివాటిలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో 2019లో ఐక్యరాజ్యసమితి అతడిని ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించింది.