Biggest Missile : పొరుగు దేశం చైనా (China) తన అమ్ములపొదిలోని అత్యాధునికమైన భారీ అణు క్షిపణి (Nuclear missile) ని ప్రదర్శించింది. విక్టరీ డే మిలిటరీ పరేడ్ (V-day Military Parade) లో ఈ క్షిపణిని ప్రదర్శించి, ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భారీ అణు క్షిపణిని ‘డీఎఫ్-5సీ (DF-5C)’ గా వ్యవహరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ సరికొత్త మిసైల్ రేంజి తెలిస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఈ భూగోళం మొత్తం కూడా ఈ భారీ మిస్సైల్ రేంజిలోకి వస్తుంది. అంటే ఈ భూమండలంలో ఎక్కడున్న లక్ష్యాన్నైనా ఈ భారీ అణుక్షిపణి ధ్వంసం చేయగలదని, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను సైతం ఛేదించుకొని వెళ్లగలదని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్షిపణిని ఒక్క వాహనంపై తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీనిని మూడు భాగాలుగా తరలించి, ఆ తర్వాత అసెంబ్లింగ్ చేసి ప్రయోగిస్తారు. గత డీఎఫ్-5 కన్నా డీఎఫ్-5సీని వేగంగా ప్రయోగానికి సిద్ధం చేయవచ్చని అణ్వాయుధ నిపుణుడు ప్రొఫెసర్ యాంగ్ చెంగ్జిన్ వెల్లడించారు. దీన్ని భారీ బొరియ నుంచి కూడా ప్రయోగించవచ్చు.
ఈ మిసైల్ భూమిపై ఏ మూలన ఉన్న లక్ష్యాన్ని అయినా ఛేదించగలదు. చైనా ఈ క్షిపణిని ప్రయోగిస్తే శత్రువు ఎక్కడా దాక్కొనే అవకాశమే ఉండదు. శత్రు దేశంలోని భూగర్భ స్థావరాలను కూడా ఇది ఛేదించగలదు. డీఎఫ్-5సీని ప్రయోగించే విధానం కూడా విభిన్నంగా ఉంటుందని యాంగ్ చెప్పారు.
ఈ భారీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దాడి సమయంలో శబ్ధం కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగలదు. దాంతో ప్రస్తుతం ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలకు దీన్ని ఎదుర్కోవడానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.
డీఎఫ్-5సీ క్షిపణిలో MIRV (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్) ని వాడారు. అంటే ఏకకాలంలో పలు అణు, సంప్రదాయ వార్హెడ్లను, గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చే డెకాయ్లను ఇది మోసుకెళ్లగలదు. వేర్వేరు లక్ష్యాలపై ఏక కాలంలో దాడి చేసేలా 10 వార్ హెడ్లను తీసుకెళ్లగలదని అంచనావేస్తున్నారు.
సాధారణంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులకు అత్యంత కచ్చితత్వంతో దాడిచేసే సామర్థ్యం ఉండదు. వాటిల్లో ఇంటర్నల్ గైడెన్స్ సిస్టమ్, స్టార్లైట్ గైడెన్స్ టెక్నాలజీలను వాడుతుంటారు. కానీ డీఎఫ్-5సీలో మాత్రం చైనా అభివృద్ధి చేసిన బైడూ నావిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీలను వాడారు. అందుకే ఇది 20 వేల కిలోమీటర్లు ప్రయాణించినా షార్ట్ మిసైల్లా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా చెబుతోంది.