Big dinosaur: పిల్లల సంతోషం కోసం తల్లితండ్రులు అడిగింది కొనిస్తుంటారు. ఆడుకోవడానికి బొమ్మలు, తినడానికి చాక్లెట్లు, బిస్కెట్లు ఎన్నో సమకూరుస్తారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ ఉండదు. కానీ తన నాలుగేళ్ల కొడుకు సంతోషం కోసం ఓ తండ్రి కొన్న బొమ్మ మాత్రం.. ఆ బుడితోపాటు ఈ వార్త విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇంతకూ ఆ తండ్రి కొన్న బొమ్మ ఏంది..? అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమున్నది..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రిటన్ దేశానికి చెందిన గుర్న్ ద్వీపంలో థియో అనే నాలుగేళ్ల బాలుడు దుకాణంలో ఉన్న డైనోసార్ బొమ్మను చూసి కొనిమ్మని తన తండ్రి ఆండ్రీ బిస్సన్ను అడిగాడు. బిస్సన్ దుకాణంలో ఉన్న ఆ బొమ్మను కొనలేదు. కానీ, ఆన్లైన్లో డైనోసార్ బొమ్మ కోసం ఆర్డర్ చేశాడు. తన తండ్రి ఆర్డర్ చేసిన బొమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగాడు.
ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు ఆ బొమ్మ రానే వచ్చింది. ఆ బొమ్మను చూసి థియో ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే తన తండ్రి కొనిచ్చిన బొమ్మ చిన్నసన్నది కాదు. ఏకంగా రెండు టన్నుల బరువుతున్న ఆ బొమ్మను బొమ్మల వ్యాపారి ఒక భారీ లారీపై తెచ్చి డెలివరీ ఇచ్చాడు. బిస్సన్ ఆ భారీ డైనోసార్ బొమ్మను క్రేన్ ద్వారా ఇంటిపై పెట్టించాడు.
ఈ డైనోసార్ బొమ్మ కోసం ఆండ్రీ బిస్సన్ వెయ్యి యూరోలు ఖర్చు చేశాడట. అంటే మన కరెన్సీలో రూ.1.05 లక్షలు అన్నమాట. అమ్యూజ్మెంట్ పార్క్ క్లియరెన్స్ సేల్లో బిస్సన్ ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. అయితే తాను బుక్ చేసిన బొమ్మ 3 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల వెడల్పుతో ఉంటుందని భావించానని.. కానీ 5 మీటర్ల ఎత్తు, దానికి తగ్గ వెడల్పు ఉండటంతో ఆశ్చర్యపోయానని బిస్సన్ తెలిపాడు.