Joe Biden | 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం ప్రకటించారు. దేశాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేయాల్సిందిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను కోరారు. వారం రోజుల తర్వాత తాను మీడియా ముందుకు వస్తానని జో బైడెన్ తాను రాసిన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. అయితే, చట్టబద్ధంగా అమెరికా అధ్యక్షుడిగా నాలుగేండ్ల పాటు కొనసాగుతానని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం, ఆరోగ్య కారణాల రీత్యా పోటీ నుంచి వైదొలుగుతానని తెలిపారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధ పడుతున్న జో బైడెన్ మీద అధికార డెమోక్రటిక్ పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా సహా పలువురు డెమోక్రటిక్ పార్టీ మిత్ర పక్షాల నేతలు వైదొలగాలని జో బైడెన్ పై ఒత్తిడి తెచ్చారు. కొవిడ్-19 నుంచి కోలుకుని బయటకు వచ్చిన జో బైడెన్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక వచ్చేనెలలో చికాగోలో జరిగే డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. రిపబ్లిక్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన ముఖాముఖీ చర్చలో జో బైడెన్ తడబడినప్పటి నుంచి ఆయనకు ఆదరణ తగ్గుముఖం పడుతూ వచ్చింది.