Biden and Kamala | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఉచ్చరించడం మరిచిపోయారు. ఆమె పేరును పలకడం ఆయనకు ఇబ్బందిగా మారింది. చివరకు ఎలాగోలా పేరును పలికాననిపించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. అమెరికాకు అత్యంత వయసు మళ్లిన అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నారు. 2024 లో అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలో వయసు కారణంగా ఉపాధ్యక్షురాలి పేరును ఉచ్చరించడంలో ఇబ్బంది పడటాన్ని ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
కమలా హారిస్ పేరును పలకడంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబడ్డాడు. ‘కమ్మ..లా..’ అంటూ ఒత్తుతూ సాగదీస్తూ కమలా పేరును ఉచ్చరించారని న్యూయార్క్ టైమ్స్ తన వార్తా కథనంలో రాసింది. అమెరికా సెకండ్ ఇన్ కమాండ్ పేరునే పలకడంలో అంతగా ఇబ్బంది పడటమేంటని పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ఆయన మానసికంగా క్షీణించిపోయారని విమర్శిస్తున్నారు.
ఎన్బీఏ ఛాంపియన్ గోల్డెన్ స్టేట్ వారియర్స్ నిమిత్తం వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఓ వేడుకలో జో బైడెన్ ప్రసంగించారు. కమ్మ..లా అంటూ కమలా పేరును ఉచ్చరించిన బైడెన్.. మేమంతా కాలిఫోర్నియాలో తుఫానులు, వరదలు, కొండచరియలు విరిగిపడి ప్రజలు ఇబ్బంది పడటం గమనిస్తున్నామని, వారి క్షేమం కోసం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఆయన దంతాల సందుల్లో నుంచి గాలి పోవడం కారణంగా నత్తిగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని బైడెన్ మద్దతుదారులు అంటున్నారు. కాగా, సోమవారం కూడా ఓ వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా కూడా బర్త్‌డే బాయ్ పేరును కూడా మరిచిపోయాడు. గతంలో కూడా కమలా హారిస్‌ను అధ్యక్షుడిగా బైడెన్ పలుసార్లు సంబోధిస్తూ దొరికిపోయాడు.