Joe Biden | వాషింగ్టన్, జూలై 8: ఒక పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. దానికి తోడు అయన అభ్యర్థిత్వం వదులుకోవాలంటూ సొంత పార్టీలోనే నిరసన గళాలు అధికం అవుతున్నాయి. తానే డెమోక్రాటిక్ అభ్యర్థిగా రంగంలో ఉంటానని ఇప్పటికే స్పష్టం చేసిన బైడెన్ ఇలాంటి ప్రచారానికి ముగింపు పలకాలని పార్టీ వర్గాల వారికి మరోసారి గట్టిగా చెప్పారు.
ఈ మేరకు సోమవారం ఆయన పార్టీ సహచరులకు రెండు పేజీల లేఖ రాసారు.అందరూ ఏకంగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్తూ ట్రంప్ ఓటమికి కృషి చేయాలని ఆయన కోరారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల బరిలో బైడెన్ ఉండాలా? పక్కకు తప్పుకోవాలా అనే అంశాన్ని ఆయన శనివారం వెల్లడిస్తారని బైడెన్ సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ తెలిపారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని భావిస్తే ఆ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హరీస్‌ను ఆయన ప్రతిపాదించే అవకాశముందని తెలిపారు. ఇటీవల ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడినంత మాత్రాన ఆయన సామర్ధ్యాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని అన్నారు.